RSS

Author Archives: Murthy Ravi

About Murthy Ravi

నా గురించి రాసి నా టైము, చదివించి మీ టైమూ తినలేను. moorthi.rln@gmail.com

Narsapur Express

“ఏరా బయల్దేరావా?”

“ఆ… బయల్దేరుతున్నా”

“ఏంటింత లేటు.. త్వరగా బయల్దేరు.. జాగ్రత్త నాన్నా.. వేగంగా వెళ్ళొద్దు..”

“మేనేజర్ ఇప్పుడే వదిలాడమ్మా.. నేను స్టార్ట్ అవుతున్నా.. పెట్టెయ్”

కాల్ పెట్టేసి టైం చూసుకుంటే ఇంకా ట్రైన్ కి 20 నిముషాలు ఉంది. ట్రాఫికర్ లేకపోతే బేఫికర్ గా క్యాచ్ చెయొచ్చు. లాంగ్ వీకెండ్ వంక పెట్టుకుని ఈ రోజే కోడ్ రివ్యూ చెయ్యాలి అని కూర్చోబెట్టేసిన మేనేజర్ ని తిట్టుకుంటూ ఒక సారి,  ఫ్రైడే ఈవినింగ్ డిఫెక్ట్ ఓపెన్ చేసిన టెస్టర్ గాడ్ని తిట్టుకుంటూ ఒకసారి కిక్ కొట్టినా స్టార్ట్ అవ్వని నా పల్సర్, నా దురదృష్టాన్ని తిట్టుకున్నప్పుడు కొట్టిన కిక్ కి అవ్వడం కో-ఇన్సిడెన్స్ అని సరిపెట్టుకుని ఆఫీస్ సెల్లార్ నుంచి బయట పడ్డాక గాని తెలీలేదు అప్పటి వరకు బయట పడ్డ వర్షం గురించి. ఎంత పడిందో అనుకుంటూ మెయిన్ రోడ్ మీదకొస్తే జాం అవ్వని ట్రాఫిక్ వల్ల తెలిసింది పెద్దగా పడలేదని.

 

రెండు హమ్మయ్యలు. మనమేం పెద్ద వర్షం మిస్స్ అయిపోలేదు. ట్రాఫిక్ వల్ల ట్రెయిన్ మిస్స్ అవ్వక్కర్లేదు. తిరుపతి లడ్డూ ఆఖరి పలుకుల్లా మేఘాల అంచుల్లోంచో, కొమ్మల ఆకుల్లోంచో అప్పుడప్పుడు పడుతున్న నాలుగు చినుకుల్ని ఆస్వాదిస్తూ దూసుకుపోతున్న నా పల్సర్ ని, మనసుని ఒక దృశ్యం పట్టి ఆపింది. కరుణాకరణ్ సినిమాల్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ లో లా తెల్ల చుడిదార్ వేసుకున్న ఒక అమ్మాయి నల్ల లగేజ్ బ్యాగ్ చేత్తో పట్టుకుని థమ్సప్ సింబల్ ని పడుకోబెట్టి లిఫ్ట్ అడుగుతుంది.

 

‘నన్నేనా?’ వెనక్కి తిరిగి చూశా.. యే ఆటో వెధవా లేడు. అంటే నన్నే. ఇంత అందమైన అమ్మాయి నన్నూ.. లిఫ్టూ.. బాడీ కి టైం లేకపోవడం వల్ల మనసులోనే తీన్మార్ ఆడేస్కుని బ్రేక్ తొక్కేసి గేర్ డౌన్ చేశా.. హైద్ లో చాలా మంది అమ్మాయిల మొఖాలు దూరం నుంచే బావుంటాయి.. అద్దాలు హాల్ లో పెట్టుకుని బెడ్రూం లో తయారవుతారేమో.. కాని ఈ మొహం దగ్గర కొచ్చాక కూడా బావుంది.. తను ఫ్రంట్ వీల్ దగ్గరున్నప్పుడు నేనేసిన బ్రేక్ కి తనకి బ్యాక్ సీట్ చూపిస్తూ ఆగింది నా మనసెరిగిన పల్సర్.

“కొంచెం ముందు దాక లిఫ్ట్ ఇస్తారా?” అంది కళ్లతో హాయ్ చెప్తూ..

“ష్యూర్.. రండి” అన్నాను.. బ్యాగ్ ఒళ్ళో పెట్టుకుని ఒక వైపుకి కూర్చుని “పదండి” అంది..

 

స్టేషన్కంటావా? బ్యాగ్ చూస్తే అదే డౌట్ కాని అమ్మాయిలు ట్రైన్ ఎక్కడం, ట్రైన్ టైం కి రావడం లాంటివి ఎప్పుడో గాని జరగవ్. జరగవ్ కదా అని మనం అనుకుంటే అప్పుడే జరుగుతాయ్. అందుకే ఇంకేం అనుకోవద్దు.

 

ఎప్పుడైనా ఏ అమ్మాయైనా లిఫ్ట్ అడగకపోతుందా అని హైర్‌స్టైల్, పెర్ ఫ్యూమ్స్, డ్రెస్సింగ్ ఎన్ని మార్చినా ఎవరూ అడగలేదు.. పక్క సీట్లో కూర్చునే దానెమ్మ టెంకి అది కూడా ఆటో తీసుకొస్తావా అని తప్ప డ్రాప్ చేస్తావా అని ఎప్పుడూ అడగలేదు.. అలాంటిది ఈ రోజు ఇలా కాలం కలిసి.. అవ్నూ.. ఇంతకీ.. ఈ రోజు ఏం మార్చాం?? సాక్స్.. సాక్స్ మారిస్తే లిఫ్ట్ అడుగుతారా? అలా అంటే రోజుకో వెరయిటీ వేసే వాడ్ని కదా.. ఛి ఛీ.. ఆలోచనలు ఆపి కొంచెం తొందరగానే బండి కదిలించాను. లేకపోతే యే ఆటో వాడో వచ్చి ఎగరేసుకు పోతాడు. సరిగా మాట్లాడుకుని ఎక్కితే ఆడికి 60 రుపాయల బేరం అంతే..  ఎక్కి మనతో సరిగా మాట్లాడితే 60 యేళ్ళ జీవితం. కాని అమ్మాయిలు ఆటో కి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకో మరి..

ధైర్యం చేసి “ఎక్కడి దాకా అండి” అన్నాను.. ”

“వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా” అంది..

మిర్రర్ అడ్జస్ట్ చేసి చూశాను.. ఇయర్ ఫోన్ లో మాట్లాడుతుంది..  చెమటో, వర్షపు చినుకుల తడో గాని మొహానికి తేనె పూత పూసినట్టు మెరుస్తుంది.. ఆ ఫోన్ అలా మాట్లాడుతూ ఉండగానే నాకు ఫోన్. మెల్లగా జేబు లోంచి తీసి చూస్తే భరత్ గాడు. స్టేషన్ కి వచ్చేసి ఉంటాడు అనుకుని లిఫ్ట్ చెయ్యనందుకు 5 సార్లు నన్ను విబ్రేట్ చేసి నా డయల్ టోన్ విన్నాడు..

 

ఇహ తప్పదు అని ట్రాఫిక్ నిబందనోల్లంఘన చేసి ఫోన్ లిఫ్ట్ చేసి బుగ్గకి, భుజానికి మధ్యలో నొక్కి పెట్టి ఏంట్రా అంటే, ” నేను రావట్లేదు రా..  రేపు డెలివరీ ఉంది. మా మేనేజర్ ఉండమన్నాడు” అన్నాడు..

“వాడి డెలివరీ కి నువ్వేం చేస్తావ్” అన్నాను..

వాడేదో అన్నాడు. నేను వినలేదు..

అద్దం లో తన టెన్షన్ గమనించి అర్జెంట్ గా వెళ్ళాలేమో అని “సరే టికెట్ మెయిల్ చెయ్” అని పెట్టేశా..

“మీరెక్కడి దాక” అన్నాను. రెప్లై లేదు.. మళ్ళీ మిర్రర్ చూశా.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుంది.. దీనెంకి టెంకి.. ఇయర్ ఫోన్స్ రెండు రకాలుగా ఉపయోగ పడతాయి అని ఇప్పుడే తెలిసింది.. మాట్లాడటానికి, మాట్లాడకుండా ఉండటానికి.. ఎలా కెలకాలి?? చెయ్యెత్తి కొస్చెన్ సైగ చేసా.

ఒక చెవి మ్యూసిక్ లోంచి బయటకి తీసి “ఏంటి” అంది..

“ఎక్కడి దాక” అన్నాను..

“ఇంకొంచెం ముందు దాక” అని ఆ చెవిని మళ్ళీ మూసేసుకుంది..

 

మాటల్లేవ్ కనీసం చూపులైనా కలుపుదాం అని అద్దం తుడుస్తుంటే ఒక విషయం అర్ధం అయింది.  అది తేనె పూత కాదు.. బంగారపు పూత… ఇంతలో తన పెదవుల పై విచ్చుకున్న నవ్వు వెయ్యి దీపాలు ఒక దాని తరవాత ఒకటి ఒక క్షణం వ్యవధి లో వెలిగించిన ఎఫ్ఫెక్ట్ వచ్చింది. ఎఫ్.ఎం లో వచ్చిన ఏదో కుళ్ళు జోక్ కి అయి ఉంటుంది అనుకున్నాను. అమ్మాయిలంతే.. విలువైన నవ్వుల్ని యే కుళ్ళు జోకులకైనా ఇచ్చేస్తారు.. ఏడుపులు కన్నీళ్ళు మాత్రం బాగా క్లోజ్ అయితే గాని ఇవ్వరు. ఇలా మాటల్లేకుండానే ఇంకొంచెం చాలా ముందు దాక ట్రావెల్ చేసి స్టేషన్ దాక వచ్చాను. స్టేషన్ పక్కనున్న ఛాయ్ షాప్ దగ్గర బైక్ ఇస్తే కిరణ్ గాడొచ్చి వారాంతం వాడుకుంటాడు..

ఈ అమ్మాయి అసలు ఎక్కడికి వెళ్ళాలో అని అలోచించేంతలో తనే అంది “ఇక్కడ ఆపండి” అని.

ఆపే లోగానే దిగిపోయి, చూసేలోగానే “థాంక్స్ అండి” అని చెప్పి, వినేలోగానే వెనక్కి తిరిగి స్టేషన్ లోకి వెళ్ళిపోయింది..

తనెళ్ళిపోతుంటే తను వాడే పెర్ఫ్యూమ్ తాలూకు స్మెల్ ఏదో గమ్మత్తు గా తాకింది..  జాస్మిన్ అనుకుంటా.. తన వెనకే వెళ్ళిపోవాలని ముక్కూ మనసూ ఉరకలేస్తుంటే బైక్ పెట్టి ట్రైన్ పట్టుకోవాలని మెదడు ఆ రెంటిని అదుపులో పెట్టింది..

 

బైక్ టీ షాప్ దగ్గర పెట్టి తాళం ఇస్తుంటే ట్రైన్ 20 నిముషాలు మెల్లగా వస్తుందన్న కబురు చల్లగా తెలిసింది.. ఒక వేడి టీ కొట్టి మెదడు, శరీరం ఒక సారి నిట్టూర్చగానే మనసు ఒక్క సారిగా ఫామ్‌లోకొచ్చేసింది.. ఆ అమ్మాయి.. యే ట్రైన్ అయి ఉండొచ్చు.. నర్సాపూర్.. కాదు.. బేసిగ్గా అమ్మాయిలు ట్రైన్ కి ఒక గంట ముందు వస్తారు. కాబట్టి మచిలీపట్నం అయి ఉండొచ్చు.. చలో ప్లాట్ ఫాం నంబర్ టెన్.. ఉఫ్ఫ్.. పరుగు లాంటి ఉరుకు లాంటి నడక.. టైం లేదు.. మనిషి మూడ్ లోంచి మెషీన్ మోడ్ లోకి మారి స్టార్ట్->రన్->స్కాన్ ఆల్ విండోస్.. ఎగ్జిగ్యూట్ చేశాను. ఉఫ్ఫ్. నో రిజల్ట్ ఫౌండ్.. టైం చూస్తే నర్సాపూర్్‌కి ఇంకో 5 మినిట్స్ మాత్రమే ఉంది.. ఆఫిస్ లో రోజూ బిజీ అని స్టేటస్ పెట్టుకుంటాం కాని ఇదీ బిజీనెస్ అంటే.. ఉఫ్ఫ్.. మళ్ళీ ప్లాట్ ఫార్మ్ వన్. నేనూ ట్రైనూ ఒకేసారి ప్లాట్ ఫామ్ మీదకొచ్చాం.. ప్లాట్‌ఫామ్ మీద కూలబడి ఒక వాటర్ బాటిల్ ఖాళి చేసి ట్రైన్ లోకి ఇంకోటి కొని ట్రైన్ బయల్దేరే ముందు ఎక్కేసి బ్యాగ్ పడేసి ఆ అమ్మాయి గుర్తొచ్చినా లైట్ తీస్కుని, ఫానేస్కుని పడుకున్నాను.  ఆకలికి రుచి, నిద్రకి సుఖం తెలీవు అంటారు. ప్రపంచం నాకు తెలీడం మానేసింది..

 

కష్టపడిన పుణ్యానికి నిద్రని గిఫ్ట్ గా ఇచ్చాడు దేవుడు. దేవుడున్న చోట దెయ్యమున్నట్టు, గిఫ్ట్ ఉన్న చోట టాక్స్ ఉన్నట్టు, ట్రైన్ లో టి.టి.ఇ. ఉంటాడు. బాబూ అని నోటితోను, కాలి మీద పెన్ను తోనూ గుచ్చి మరీ లేపాడు. టికెట్ తీసి చేతిలో పెట్టా.

“ఇంకొకడేడీ” అన్నాడు. నా ఎదురుగా ఖాళీ గా ఉన్న ఇంకో అప్పర్ బెర్త్ చూపించి. రాలేదు అని చెప్తే దానం చేసేస్తాడు లేకపోతే అమ్మేసుకుంటాడు. తత్కాల్ టికెట్ కాబట్టి మనకేం డబ్బులు రావు.

“ఎస్ 12 కెళ్ళాడు చుట్టాల దగ్గరకి” అని చెప్పాను, ఎవడైనా టికెట్ లేని వాడు తగల(డ)క పోతాడా ఆ ధనమో, ధన్యమో మనకే దక్కుతాయ్ అనుకుంటూ. వాడేదో రావలసిన పోలవరం ప్రోజెక్ట్ రానట్టు మొహం పెట్టి పక్క రూమ్ కెళ్ళాడు, మా రూమ్‌లో లైట్ కట్టేసి. టి.టి.ఇ గాడి గుచ్చుడు కి చచ్చిపోయిన నిద్రని మళ్ళీ బతికించే ప్రయత్నం లో పడ్డాను.

 

ఆ ప్రయత్నాన్ని కూడా తునా తునకలు చేస్తూ అరుస్తున్నాడు టి.టి.ఇ., “ఎన్ని సార్లు చెప్పాలమ్మా. ఆన్-లైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ ఉంటే కేన్సిల్ అయిపోతది. నేనేం చెయ్యలేను”.

తలెత్తి చూసే ఓపిక కూడా లేదు. పక్క రూమ్ లో కూడా లైట్ ఆఫ్ చేసి పక్క-పక్క రూమ్ కెళ్ళాడు. ఏదో గమ్మత్తైన సువాసన ముక్కుని తాకడం మొదలెట్టింది. ఇదేదో…. ఇందాక… స్టేషన్ లో.. యెస్స్..  టక్కన లేచి తల రూఫ్ కి కొట్టుకుని మళ్ళీ స్లో గా లేచి చూశాను. ఆ అమ్మాయే అయి ఉండాలి. టి.టి.ఇ చుట్టూ మూగిన చీమల్లో సరిగా తెలీట్లేదు..

కిందికి దిగుదాం అనుకుని దూకేసి అటు వైపు వెళ్తుంటే “ఇది నువ్వని సాక్ష్యం ఏంటి” అని టి.టి.ఇ గాడు ఐ.డి. ప్రూఫ్ లేని వాడి మీదేసిన కుళ్ళు జోక్ కి చీమలన్నీ నవ్వుతున్నాయి.

నవ్వి ఇంప్రెస్స్ చేస్తే టికెట్ ఇస్తాడేమో అని ఆశ అయి ఉండొచ్చు. కొంచెం ఒంగి చూసాను. మనం లిఫ్ట్ ఇచ్చిన చీమే. కాని నవ్వట్లేదు.. ఎలా కెలకాలి?!.. మెదడు లో ఉన్న పాదరసం అంతా ఒక్కసారి షేక్ చేస్తే ఒక బొట్టు పని చేసింది. తననే అంటి పెట్టుకుని ఇంకో అమ్మాయి ఉంది. వాళ్ళిద్దరూ కళ్ళతో మాట్లాడుకోవడంతో ఇద్దరూ కలిసే వచ్చి ఉంటారు అని అర్ధం అయింది. ఆ అమ్మాయి కొంచెం వెనక్కి కూడా ఉంది. ఆ అమ్మాయిన నానా సైగలూ చేసి పిలిచి మా రూమ్ దాక తీసుకెళ్ళి ఒక బెర్త్ ఉంది ఎక్ష్ట్రా కావాలంటే తీసుకోండి అన్నా..

 

“ఒక్కటేనా? మేం ఇద్దరం ఉన్నాం” అంది. మొహమెందుకో నీరసంగా ఉంది.

“ఆయన్నడగండి” అని టి.టి.ఇ ని చూపించాను కొంచెం ఎటకారంగానే.

“ఉండండి ఒక్క నిముషం..” అని హీరోయిన్ ని పిలిచి మా పక్క రూమ్ దగ్గర  నేను 20 సెకెన్స్ లో చెప్పింది 5 నిముషాల్లో సింపుల్ గా చెప్పింది. ఆవిడ చాలా సీరియస్ గా ఆలోచించి నా వైపు చూసి, ? మొహం పెట్టింది.

“హే, హాయ్. మీరా?” అన్నాను.

“హా….య్” అనుమానం గా సాగదీసింది.

“ఎవరే” అని అడిగిన సహ నటికి “ఇందాక లిఫ్ట్ ఇచ్చారు….” అని నా వైపు తిరిగి, “బెర్త్ ఉందన్నారంట కదా” అంది.

“హా.. మా ఫ్రెండ్ ఒకడు రాలేదు..” అంటుంటే “విన్నాను ఇందాక. మా ఫ్రెండ్ టికెట్స్ బుక్ చేశాను కన్ఫర్మ్ అని చెప్పాడని మేం డైరెక్ట్ ట్రైన్ ఎక్కేశాం. చెక్ చెయ్యడానికి టైం కూడా లేదు. చెత్త వెదవ. ఫోన్ చేస్తే బుక్ చెయ్యడం కన్ఫర్మ్ అని చెప్పాను అంటున్నాడు. చె… ..ధవ.. నరికి.. పో..లు పెట్టాలి.” మింగడానికి ట్రై చేస్తూ కక్కుతుంది.

నేను నవ్వడం చూసి ఆపి నా వైపు తిరిగి “దీనికి హెల్త్ కూడా బాలేదు. ఇది ఇక్కడ పడుకుంటుంది. నేను లేడీస్ భోగిలో ఎడ్జస్ట్ అవుతాను. చాలా థాంక్స్ అండి” అని అప్పటి దాక లోయర్ బెర్త్ మీద ఆనించిన బ్యాగ్ తీసింది.

దాంతో పాటు నాలో గాలి కూడా.

“ఒక పని చెయ్యండి లేకపోతే. గుంటూర్ తరవాత ఎలాగు ఖాళీ అవుతాయ్. టి.టి.ఇ ని అడిగితే ఇస్తాడు.. అందాక నా బెర్త్ లో కూర్చుందాం” తనతో ఉండటానికి ఒక చీకటి బాణం.

“హ్మ్మ్.. అంటే.. మీ…ందుకు.. ఇబ్బ… అని.. ” పర్లే బానే వేశా బాణం.

“ఇంకెంతండి టూ హవర్స్. ఏం పర్లేదు మీరు రండి చెప్తాను” అన్నాను. అప్పర్ బెర్త్ ఇద్దరు కూర్చోడానికి కష్టం అని సైడ్ లోయర్ లో లెగ్గింగ్స్ వేసుకున్న డ్రెస్ సెన్స్ లెస్స్ గజ గామినిని అతి కష్టం మీద లేపి “కెన్ యు ప్లీజ్…” అనే లోపలే “నో” అంది అప్పర్ బెర్త్ వైపు చూపిస్తున్న నా వేలి వైపు చూస్తూ.

“…అంది లా పె… తే.. సరిపోదు.. ” కక్కలేక మింగుతున్నట్టుంది ఈ సారి మా హీరోయిన్.

“ఇంక తప్పదు లే  పైకెక్కేయండి.” అని వెనకాలే నేనూ ఎక్కి ఇగ్లూ లో ఎస్కిమోలు సర్దుకున్నట్టు సర్దుకున్నాం.

 

అప్పటికే పైకెక్కేసిన సహ నటి పడుకుని నిద్ర పోతుంది. మన హీరోయిన్ గోతం అంత వున్న హాండ్ బ్యాగ్ లో వెతికి వెతికి మొత్తానికి ఒక మడత ఫోను బయటకి తీసింది. ఫోన్ బుక్ ఓపెన్ చేసినట్టుంది డవున్ యారో అదే పని గా ప్రెస్ చేసి కాల్ బటన్ కొట్టి మూతి బిగబెట్టింది.

“ఒరే వెదవా.. నీకు టికెట్ చెయ్యడం రాకపోతే..”

“ష్..” అన్నను ఇంటెరప్ట్ చేస్తూ..

“చె…వె..వ.. పెట్టెయ్.. మెస్సేజ్ చేస్తాను” అంది. నవ్వు ఆపుకోలేక ఇటు తిరిగాను..

“ఇర్రిటేషన్ వచ్చేస్తుండి బాబు, అసలెప్పుడూ ఇలా జరగలేదు.. వాడి మాట విని ట్రైన్ కి వెళ్దాం అని డిసైడ్ అయ్యాను.. ఛ..”..

“వదిలెయ్యండి ఎలాగోలా వెళ్తున్నాం కదా” అనబోయాను.

“మర్చిపోయాను.. మనీ ఎంతండి” అని ఆ గోతాం లో చెయ్యి పెట్టింది..

“టి.టి.ఇ. ఫైన్ రాస్తాడేమో ఉంచండి. తరవాత ఇద్దురు గాని..”..

“ఛ.. ” ఇంకేం బయటకి వినపడలేదు.. నోట్లో పళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నాయని మాత్రం తెలిసింది.

“కొంచెం వాటర్ తాగండి” అన్నాను.

“థాంక్స్ అండి.. బై ద వే సారీ కూడా. ఇందాక మిమ్మల్ని తిట్టుకున్నాను”

“ఎందుకు?! టికెట్ ఇచ్చినందుకా?”

“లిఫ్ట్ ఇచ్చినందుకు. టికెట్ లేదని తెలిశాక ట్రైన్ మిస్స్ అయినా బావుండేది అనిపించింది”.

“అయ్యో.. మీరు ఇదంతా ముందే చెప్పుంటే దార్లో ఎక్కడో దింపేసే వాడ్ని కదా” అన్నాను.

నవ్వింది.

నవ్వితే బావుంది.

మిర్రర్ లో కంటే బావుంది.

 

కొంచెం వాటర్ తాగి నాకు ఆఫర్ చేసింది. తాగాలని లేదు.. కాని తనిచ్చిన ఫస్ట్ ఆఫర్ కదా. తీసుకున్నాను..

“ఎక్కడి దాకా?” అడిగాను.

“భీమవరం” అని గ్యాప్ ఇచ్చి “మీరు?” అంది.

“పాలకొల్లు. అవ్నూ.. మీరు అక్కడ వెయిట్ చేస్తున్నారేంటి? అక్కడ ఇళ్ళు కూడా లేవు” అనగలిగాను.

“ఆ వెనకాల రోడ్ లో మా కంపెనీ ఉంది. టెక్-సాఫ్ట్ అని చిన్న కంపెనీ లెండి. మీరెక్కడ పనిచేసేది?”

ఒక ఐదు నిముషాల వ్యవధి లో ప్రొఫైల్ ఎక్ష్చేంజ్ పూర్తయ్యింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో ఇదే ప్రాబ్లమ్. ఒక సారి ప్రొఫైల్స్ తెలిసి పోయాయి అంటే మాట్లాడుకోవడానికి మాటలే ఉండవ్.

సైలెన్స్…

ప్రతి సైలెన్స్ కి ఒక వయొలెన్స్ వెనకే ఉంటది. టి.టి.ఇ. గాడు.. ఆడూ ఆడి గొంతూ ఆడెబ్బ. వచ్చీ రాగానే మమ్మల్ని చూసి ఆగాడు.

“ఏంటి ఆ అమ్మాయికి టికెట్ లేదా?” అన్నాడు. అంటే ఈ అమ్మాయిని గుర్తు పట్టలేదన్న మాట. ఎందుకు గుర్తు పట్టలేదంటావ్ అని డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూశా..  ఆహా.. అమ్మాయిల పోర్టబుల్ అజ్ఞాత వాసం. స్కార్ఫ్. తలకి చుట్టేసుకుని. మొహం కొంచెం మాత్రం బయట ఉంచింది. సహ నటి స్లీపింగ్ కాబట్టి నో ప్రాబ్లం.

“ఉంది సార్.. ఎస్ 10 లో. ఇద్దరికీ ఆర్.ఏ.సి. వచ్చింది. తనకి వొంట్లో బాలేదు అని మా ఫ్రెండ్ ని అక్కడికి పంపాం” కథ కట్టుదిట్టం గా వచ్చింది.

నమ్మాడా? అని చూశాను. నవ్వాడు. ఇలాంటివి చెక్ చెయ్యడానికి ఎస్.2 నుంచి ఎస్.10 కి యే తెలివైన టి.టి.ఈ రాడు. ఈ లోగా బోల్డు బిజినెస్ చేసుకోవచ్చు. ఆడి ఈక్నెస్ నాకు తెలుసన్న సంగతి ఆడికి తెలిసి నవ్వాడు.

ఆడలా ఎల్లగానే “భలే అల్లారండి” అంది.

“మరేంటనుకున్నారు?” అన్నట్టు నవ్వాను.

అప్పుడప్పుడూ నెక్ష్ట్ స్టేషన్, ఎంత టైం లాంటివి తప్ప మాటలేం లేవు. కాళ్ళు అవతలి అప్పర్ బెర్త్ మీదకి జాపి కొంచెం ముందుకు జరిగి అప్పుడప్పుడూ కునుకు లాగుతున్నాం. తను అటు వైపు తల వాల్చడానికి లేక నా భుజం మీద వాల్చడంtO మెలకువొచ్చి ఇంక పడుకోలేకపోయాను.. ఆ బంగారు వర్ణాన్ని అంత దగ్గరగా చూసి నిద్ర పోగలిగే వాడు ఎవడుంటాడు. ఆ మెలకువలోనే ట్రైన్ పది నిముషాలు గా ఒక చోట ఆగిపోవడాన్ని గమనించా. ఆ పక్క, ఈ పక్కా ప్లాట్-ఫామ్స్ లేవు. ఏమై ఉంటుందో అనుకుంటూ.. పోని కాసేపు పడుకోనిద్దాం అని నెమ్మదిగా తల మీద తట్టి లేపాను. నిద్ర మత్తులో సగం తెరిచిన కళ్ళు, లోపల స్వాతి చినుకుల్ని ముత్యాలు గా మారుస్తున్న ముత్యపు చిప్పల్లా ఉన్నాయి.

“పడుకోండి ఇప్పుడే వస్తాను” అని ఇటు తిరిగే లోగానే పడుకుంది. నవ్వుకుని బెర్త్ మీదనుంచి, ట్రైన్ లోంచి  దిగగానే అటుగా వెళ్తున్న ఒక రైల్వే ఎంప్లాయి కనిపించాడు.

“ఏమైందండి” అన్నాను.

“థ్రెట్ కాల్ వచ్చిందట. రైల్స్ బ్రేక్ అయినట్టు” అన్నాడు.

ఇప్పుడప్పుడే కదలదన్న మాట. పౌర్ణమి తరవాత పాడ్యమో విదియో అయి ఉండొచ్చు. చంద్రుడు బానే వెలుగుతున్నాడు. అటు ఇటు చూస్తే ఇంజిన్ కి కొంచెం ముందు ఒక చెరువు లాగా మెరుస్తున్నదేదో కనపడింది.  మెళ్ళగా అటు వైపు నడిచాను. నిజంగానే చెరువే. రైలు పట్టాల వైపు గట్టు మట్టితో ఉంది కాని అవతల వైపు మెట్లున్నాయి. అలా తిరిగి వచ్చి ఆ మెట్ల మీద కూర్చుంటే చెరువు, తామరాకులు, నాచు, ఆ మధ్యలో చంద్రుడి ప్రతి-బింబం. భలే ఉంది వ్యూ. ఈ సీన్ని ఇంతే నేచురల్ గా తియ్యాలి అంటే కెమేరా లెన్స్‌కి మనిషి రెటీనా తీసి బిగించాలి. సెల్ ఫోన్ తో తీసి ప్రకృతిని కించ పరచడం అనవసరం అనిపించింది.

టైం చూడటానికి ఫోన్ తీసి చూస్తే 11:03 తో పాటు అక్క పంపిన మెస్సేజ్ కనిపించింది.

“శృంగ వృక్షం నుంచి ఒక సంబంధం……………….”

సెల్ లాక్ చేసి పాకెట్లో పెట్టి దోమలు కొట్టుకుంటూ సీనరీ చూస్తూ ఉండిపోయాను.

 

భుజం మీద ఎవరో తడుతుంటే మెలకువొచ్చింది.. కథా నాయిక…. చెరువులో దృశ్యాన్ని చూస్తూ అలానే నిద్రపోయానన్న మాట.

“పిలవొచ్చు కదా ఒక్కరే ఎంజాయ్ చేసెయ్యకపోతే.” పక్కన కూర్చుంటూ అంది.

వెన్నెల్లో తెల్ల చుడిదార్ మెరిసిపోతూ దేవతలు, అప్సరసలు ఆ జాతి జీవిలా అనిపించింది.

“నిద్ర పోతున్నారు కదా” అన్నాను.

“హా బాగా నిద్ర పట్టేసింది. సారీ!” అంది.

మళ్ళీ సైలెన్స్..

దేవుడా!! గంటల గంటలు ఏం మాట్లాడుకుంటారు అమ్మాయిలు, అబ్బాయిలు. ఇక్కడ నోరిప్పుదాం అంటే ఒక టాపిక్ కూడా దొరకట్లే..  నాకు తెలిసిన అన్ని టాపిక్ లూ తడుముకుంటుంటే తనే నోరిప్పింది.

“హే అది చూడండి. ఆ చంద్రుడు ఆకు వెనక నీళ్ళలో ఎలా కనిపిస్తున్నాడో”.

నాకు ఈ యాంగిల్ లో మొత్తం కనిపిస్తున్నాడు. అదే చెప్పాను.

“ఇటు రండి” అని తను పక్కకి వాలి నన్ను ఇలా వాలమని సైగ చేసింది. తన కళ్ళు ఉన్న ప్లేస్ లోకి నా కళ్ళు తీసుకెళ్ళా.. తన రెండు చేతులతో నా తలని వెనక నుంచి పట్టుకుని నాక్కు వ్యూ పాయింట్ సెట్ చేసింది. నీళ్ళలో వస్తున్న అలలకి నీళ్ళలో చంద్రుడు నీటి మీద తేలుతూ వూగుతున్న పళ్ళెం లా ఉన్నాడు. చెట్టుకి స్థిరంగా ఉన్న ఆకు వెనక దాక్కున్నట్టు, మళ్ళీ బయటకి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ అద్భుత దృశ్యం, ఈ అమ్మాయి అద్భుత స్పర్శ కలిసి నాకోసం కొత్త లోకం సృష్టిస్తున్నాయి.

“భలే ఉంది కదా” అన్న మాటతో తనవైపు తిరిగి ఇటు వైపు జరిగి నవ లోక నిర్మాణం ఆపించాను. “చాలా బావుంది” అన్నాను.

“మా వూళ్ళో చిన్నప్పుడు ఒక కొలను ఉండేది. దాని దగ్గర ఒక గుడి ఉండేది. మేము కలువ పూలు కోసుకొచ్చి దండ చేసి దేవుడికి వేసే వాళ్ళం. ప్చ్. అవన్నీ మిస్స్ అయిపోతున్నాం” మొహం డల్ గా పెట్టి.

నేనూ చిన్నప్పుడు అలానే చేసే వాణ్ణి. కాని చెప్తే కాపి కొట్టాను అనుకుంటుందని చెప్పలేదు.

పిచ్చిక గూళ్ళు, కోక్-మూతలు, కుడుములు…. ఏది గుర్తొస్తే అది హుషారుగా చెప్పేసి నీరస పడిపోతుంది.

“….. చిన్నప్పుడు జాతరలు, లక్క పిడతలు.. అవన్నీ గుర్తొస్తేనే.. అవ్నూ.. మీది పాలకొల్లే కదా.. మీకు శృంగ వృక్షం జాతర తెలీదా? చాలా ఫేమస్?”

“ఐడియా లేదండి. నేను సెలవులకి ఎక్కువ రాజమండ్రి మా చుట్టాలింటికి వెళ్ళే వాడ్ని.. ఇక్కడ తిరిగింది తక్కువ”

“అవునా.. కాని ఆ జాతరలో.. ……….”

ఏదో చెప్తూనే ఉంది.. విననివ్వకుండా బ్రైన్ ని బగ్ ఏదో తొలిచేస్తుంది..

శృంగ వృక్షం.. అక్క మెస్సేజ్…. యెస్స్.. సెల్ బయటకి తీసి మెస్సేజ్ చూశాను.

“శృంగ వృక్షం నుచ్ని ఒక సంబంధం వచ్చింది. పేరు హారిక. సాఫ్ట్‌వేర్ అంట. బి.టెక్. 5’2″. ఫొటో చూసి ఓ.కే. అంటే రేపే చూసుకోడానికి వెళ్దాం. అమ్మాయి కూడా ఇంటికి వస్తుందంట”.

శృంగ వృక్షం అంటే ఈ అమ్మాయేనా? అయితే బావుణ్ణు. దేవుడా.. ప్లీజ్.. ప్లీజ్..

“ఆ అమ్మాయి ఫ్యామిలి డిటైల్స్ కూడా పంపు మెలకువగా ఉంటే. మా ఫ్రెండ్ ఉన్నాడు ట్రైన్ లో ఆ వూరి వాడు. కనుక్కుంటా.” రెప్లై పంపాను.

నేను సీరియస్ గా సెల్ లో లీనమవడంతో చెప్పడం ఆపి తలెత్తి పైకి చందమామని చూస్తుంది. ఎప్పుడాపిందో, ఎక్కడాపిందో గుర్తు లేదు.

“సారీ” అన్నాను సెల్ లాక్ చేస్తూ..

“ఎవరూ గాల్ ఫ్రెండా?”

“కాదు.. అక్క.. ఇంటికి రమ్మని మెస్సేజ్ చేశాను” సగం నిజం. సగం అబద్దం.

“ఎక్కడుంటారు మీ అక్క”

“రాజోలు”

“ఓహ్.. దగ్గర్లో ఉంటే ఇంచక్కా ఎప్పుడు రావాలంటే అప్పుడు రావచ్చు కదా ఇంటికి. అదృష్టం ఉండాలి” నిట్టూర్చింది.

“మీకూ ఉంటుంది లెండి అదృష్టం” ఏం అనాలో తెలీక అనేశాను..

“నా దురదృష్టానికి రేపు ఫైనల్. రేపు నా పెళ్ళి చూపులు.. ఎవడొస్తాడో, ఏమంటాడో”…

నేనేనా? నేనైతే ఏం అనను.. ఇంకో విషయం కూడా కలిసింది.. దేవుడా ఇంకొంచెం.. ప్లీజ్.. ప్లీజ్..

సెల్ తీసి చూశాను అక్క మెస్సేజ్ లేదు. ఫోన్ చేసి లాక్ చేశేసాను. నిద్ర లేచి లిఫ్ట్ చేసి నేను మాట్లాడను కాబట్టి పెట్టేసి, మెస్సేజ్ చూసి రెప్లై ఇస్తుంది.

 

నా ఐడియా 2 నిముషాల్లోనే రిజల్ట్ ఇచ్చింది.

“పూర్ణ గారి అమ్మాయంట. వాళ్ళకి మిల్ ఉందంట. రేపు మాట్లాడదాం. గుడ్ నైట్.”

గుడ్ నైట్ కి రెప్లై ఇచ్చి “అవ్నూ.. మీ నాన్న గారు ఏం చేస్తారు?” బాబోయ్ ఇలా అడిగేశానేంటి. ఎదవ కంగారు నీకు దరిద్రుడా..

“రైస్ మిల్ల్ ఉందండి. పొలాలు కూడా ఉన్నాయి. ఎందుకలా అడిగారు?”

“ఊరికే… ” కారణం ఏం చెప్పాలో తేలీట్లేదు.. మనసు లోపల తీస్మార్ ఆడేస్తోంది.. దేవుడా జస్ట్ లైట్ గా.. ప్లీజ్ ప్లీజ్..

“అబ్బాయి ఏం చేస్తాడండి?”

“ఎవరి అబ్బాయి?”

“అదే మీకు కాబోయే మామ గారి అబ్బాయి.”

“నాకు డిటైల్స్ తెలీవండి. చెప్పలేదు. ఇంటికి రా చెప్తాం అన్నారు. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోమంటే ఎలా తీసుకుంటాం చెప్పండి.”

“నిజమే అండి..” అన్నాను నాన్న గారి పేరు ఎలా అడగాలి… ఐడియాలేం రావట్లేదు..

“రైస్ మిల్ అంటే పూర్ణ గారు అంటారు…” చీకటి బాణం..

“మా నాన్న గారి పేరు పూర్ణ చంద్ర రావు అండి. బయటి వాళ్ళు పూర్ణ అంటారేమో నాకు తెలీదండి. మా ముందు అయితే పూర్తి పేరుతోనే పిలుస్తారు” అని నవ్వింది.

యెస్స్.. యెస్స్.. దేవుడోయ్.. ఉన్నావురోయ్.. ఫీలవ్వకు.. ఉన్నావయ్యో…

అల్పపీడనం పట్టినప్పుడు కేరింతలు కొట్టే సముద్రం లా ఉంది మనసు.

“అవునా..” మాటల్లో యాంత్రికత వచ్చేసింది. మనసు రేపు నన్ను పెళ్ళి చూపుల్లో తను షాక్ అవ్వబోయే తన మొహాన్ని ఊహించడానికి  మెదడుని వాడేసుకుంటుంది..

“అవునూ మిమ్మల్ని దోమలు కుట్టవా?” అంది నా కాళ్ళ వైపు చూస్తూ..

“కుట్టిన దోమైతే మళ్ళీ కుట్టదు. కొట్టేస్తాను కదా!”

“పదండి అలా వెళ్దాం. అక్కడ దోమలెక్కువున్నాయంట. కొట్టేద్దాం.”..

పర్లేదు పంచ్ మేకరే. లేచి రెండున్నర అడుగులు వేశామో లేదో ట్రైన్ కూతేసింది. ఇంజిన్ కి ముందు భాగం లో ఉండటంతో ఒక్క సారిగా ఉలిక్కి పడి, తడబడి దేవుడికి దణ్ణం పెట్టుకుంది.

నాకు నవ్వొచ్చింది. తనకి కోపమొచ్చింది.

కొంచెం వేగంగానే ఎస్.2 చేరుకుని పైకెక్కేసింది. తన వెనక నెమ్మదిగా వెళ్ళి ఎక్కుతుంటే బెర్త్ లో ప్లేస్ ఇవ్వట్లేదు. “పడుకుంటారా?” అని అడిగితే “కూర్చుందాం లే రండి” అని నవ్వింది.

నచ్చింది.

అక్కడ అంతకన్నా ఎక్కువ సేపు కోపం మైంటైన్ చేస్తే మిగతా వాళ్ళకి ఇబ్బంది. ఎక్కేసి అలాగే ఇబ్బంది పడుతూ మొత్తానికి నిద్ర పోతూ లేస్తూ ఉన్నాం. మొత్తానికి తెల్లారేక తెలివొచ్చింది. ఎప్పుడు పొజిషన్ మార్చుకుందో తెలీదు. మాములుగా పడుకుని కాళ్ళు నాకు తగలకుండా మడిచి నాకు గోరు దూరం లో ఆపింది. కిందకి దిగి రైల్వే బాత్రూం ని దర్శించి, భరించి ఫేసు వాష్ చేసుకుని వచ్చేటప్పటికి తను, సహనటి ఇద్దరూ కూర్చుని ఉన్నారు.

“ఎలా ఉందండి హెల్త్” అన్నాను.

“బానే ఉందండి థాంక్స్” అంది సహనటి. ఇంతలో ఆకీడొచ్చింది. అంటే నెక్ష్ట్ స్టేషనే భీమవరం.

“పట్టుకోండి. వాష్ రూమ్ కెళ్ళాలి” అని బ్యాగ్ నా వొళ్ళో పెడుతుంటే చేత్తో అందుకుని,

“ఎందుకండి ఇంత బ్యాగ్. వర్షం వస్తే పడుకుంటారా ఇందులో” అంటూ పక్కన పెట్టాను.

కోపం గా చూస్తూ సహనటి ని ఫాలో అయింది.

బ్యాగ్ వైపు, నా వైపు, తన వైపు మార్చి మార్చి కొస్చెన్ మార్క్ ఫేస్ పెట్టి చూస్తూ వెళ్తోంది సహ నటి. వీళ్ళిద్దరూ ఇంత క్లోజ్ ఎప్పుడయ్యారు అని అనుకుంటా..

క్లోజ్ ఏంటే పిచ్చ మొహమా?! మరో కొన్ని గంటల్లో షాక్ అయ్యి నువ్వు కోమా లోకి పోయినా పోతావ్..

అసలింతకీ పేరేంటో? హారికేనా? ఎలా అడగాలి. మిగతా డిటైల్స్ అన్ని అవసరాన్ని బట్టి అడిగాం. పేరుతో పనేముంది? తిడతారో? తిట్టుకుంటారో?

షేక్ ది మెర్క్యురీ మేన్.. వాళ్ళిద్దరూ వచ్చి బ్యాగ్ లు సర్దుకోవడం మొదలెట్టారు. ఇంతలో తన ఫోన్ రింగ్ టోన్ వినపడింది.. బ్యాగ్ అందించా..

బ్యాగ్ లోంచి ఫోన్ తీసి రొటీన్ హెలో తరవాత “హా.. దగ్గర్లో ఉన్నాం నాన్నా..  2 మినిట్స్.” అని పెట్టేసి నా వైపు తిరిగి “ఉంటామండి.. బై. చాలా థాంక్స్ అండి. మీరు హెల్ప్ చెయ్యకపోయుంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళం.” పేరడిగే గ్యాప్, అవకాశం ఇవ్వకుండా మా మేనేజర్ లా చెప్పేసి బయల్దేరింది. ఆ చెప్పడం లో నాకు తను చెప్పనివి కొన్ని వినపడ్డాయి.

“మా నాన్న ఉంటారు స్టేషన్ లో. మీరు మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది..” లాంటివి..

స్టేషన్ వచ్చింది. పక్క కోచ్ కెళ్ళిపోయి అక్కడ నుంచి ప్లాట్‌ఫామ్ మీదకొచ్చి తనని చూడటానికి ప్రయత్నించా. రాక రాక వచ్చిందో ఏంటో చాలా మంది వచ్చారు. అందరూ మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నారు ప్లాట్‌ఫామ్ మీద. వెళ్దామా? వద్దా? అని మెదడడిగిన ప్రశ్న కి రేపెళ్దాం లే అని మనసిచ్చిన వెటకార-సమాధానం తో అనుమానం అంతా వదిలిపోయింది. మెల్లగా వాళ్ళని ఫాలో అవుతుంటే సహనటి అనుమానం గా చూస్తుంది, రావొద్దు అనే సైగ తో పాటు.. తనకేదైనా ప్రాబ్లం అవుతుంది అని ఆగి పోయా.. ఇంకా కాసేపు చూడచ్చు అనే ఆశతో పక్కనే ఉన్న బెంచ్ ఎక్కాను. చేతిలో ఉన్న టికెట్ ప్రింట్ ని వాళ్ళ నాన్నో ఎవరో ఒకాయన కి చూపించి చింపేసి పడేసింది. రాత్రి తిట్టినట్టే టికెట్ తీసినోడ్ని తిట్టి ఉంటుంది. వాళ్ళు ప్లాట్‌ఫామ్ మీద నుంచి బయటికెళ్ళే మార్గం లోకెళ్ళే వారకూ ఫాలో అయి వెనక్కి తిరిగా.. ఓహ్.. టికెట్ లో పేరు ఉంటుంది కదా.. ఇందాక షేక్ చేసిన పాదరసం ఇప్పుడు పని చేస్తుందన్నమాట.. వెనక్కి తిరిగి పరుగెత్తాను. తను పడేసిన స్పాట్ కి పెద్ద దూరం లో లేకపోవడంతో ఈజీ గానే దొరికింది. కాని ఒక ముక్కే ఉంది. వెదికేంత స్కోప్ లో ఇంకో ముక్క దొరకలేదు. ట్రైన్ బయల్దేరటం తో ఎక్కేసి డోర్ లో నిలబడి ఆ ముక్క పరిశీలించా.. ఆ ముక్కలో hari, gaya అని సగం పేర్లు, 5 అంకెల ఫోన్ నంబర్ ఉన్నాయి. gaya అంటే గాయత్రి అయి ఉండొచ్చు. hari అంటే హారికే అయి ఉండొచ్చు. ఇన్ని కలిపిన దేవుడు ఈ ఒక్కటి కలపక పోడు.. యెస్స్. యెస్స్. యెస్స్… ఆ ముక్క మడతెట్టి పర్స్ లో పెట్టి సీట్ లో కూల బడ్డాను. నిస్సత్తువ నీరసం మొత్తం ఇప్పుడు ఆవహించాయి. రాత్రంతా ఏం జరిగిందో రివైండ్ చేసి, ఈ రోజు ఏం జరగబోతుందో ఇమాజిన్ చేసి మనసు ఎంజాయ్ చేస్తుంటే అలసి పోయిన మెదడు గోలెడుతుంది నా వల్ల కాదని.

స్టేషన్ లో వెయిట్ చేస్తున్న నాగు గాడితో ఇంటికి వెళ్ళేటప్పటికి గుమ్మం లో అక్క.

“ఎప్పుడొచ్చావే” అన్నాను.

“ఇందాకే రా!”

“రెడీ అయ్యి రారా! మాట్లాడదాం”

“మాట్లాడటం ఏంటి? పెళ్ళి చూపులకెల్దాం అన్నావు కదా?!” షాకయినట్టుంది.

“అదేంట్రా! నువ్వు ఫొటో చూడలేదు గా ఇంకా.. చూశాక చెప్తావ్ అని చూస్తున్నా నేను”

“ఫొటోదేముందే.. డైరెక్ట్ గా చూస్తాం కదా!!”

“బాబూ.. నువ్వు ఎదవ డైలాగులేసి అక్కడ మళ్ళీ అమ్మాయి నచ్చలేదని అనకు. ఒకసారి ఫొటో చూసి చెప్పు”

“ఏం అవసరం లేదు.. ఎవరెవరం వెళ్దామో వాళ్లందర్నీ రమ్మను”

“ఒరే.. నువ్వేనా?!”  అక్కకే నేను బాగా అర్ధమవుతాను అంటారు. కాని ఈ రోజు దానికి “తమ్ముడు” సబ్జెక్ట్ లో కొత్త చాప్టర్. దానికీ అర్ధం కావట్లేదన్నమాట.

లోపల నిన్నట్నించి తొక్కేసిన ఆనందం అంతా డెలివరీ ఇచ్చేయ్యాలి బాత్రూమ్ కెళ్ళి. ఇంకెక్కడ డాన్స్ చేసినా వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది.. పెళ్ళి చూపులయిపోయాక చెప్తే షాకో, సర్ప్రైజో మైంటైన్ అవుతుంది. అప్పటి దాక ఈ కంఫ్యూజన్ లోనే ఉండనియ్..

కడుపులో దాచిన ఆనందాన్నంతా కాళ్ళతో గెంతేసి బాత్రూం నుంచి బయటికొచ్చే సరికి సుబ్బారావ్ బాబాయ్ వచ్చాడు.

“ఏరా అబ్బాయ్. ఎలా ఉన్నావ్? ఫొటో చూశావా? అమ్మాయి మాకు నచ్చింది రా. నువ్వు సరే అంటే వెళ్దాం” పలకరింపు, ప్రశ్నలు కలిపి గుత్తగా మీద పడేశాడు.

“మీరంతా ఓ.కే అంటే నాకూ ఓ.కే బాబాయ్. చూసేదేముంది.. ” ఓ బిస్కెట్టేశా.

“ఆ మాటలెందుకులే కాని రేపు మాకు తాటాకులు కట్టకపోతే చాలు”. సుగర్ ఉందనుకుంటా. బిస్కెట్ తినలేదు.

“ఒరే ప్లీజ్ రా! ఒక్క సారి ఫొటో చూడరా.. ప్లీజ్ రా.. నాకోసం రా” అక్కొచ్చింది ఫొటో చేత్తో పట్టుకుని మొహానికి ఎదురుగా పెడుతూ.. .. దాని భయం దానిది..

దాన్ని ఏడిపించడానికి చూడకూడదు అనుకున్నా తన మొహం చూడాలనిపించింది. ఫొటో దాని చేతిలో కదులుతూ ఉంటే సరిగా కనిపించట్లేదు. చేతిలోకి తీసుకుని చూశా.. తను కాదు. ఫొటో మారినట్టుంది. అదే వీళ్లతో అంటే నీకెలా తెలుసు అంటారు.. లైట్ తీసుకో.. మనకి రాత్రే అయిపోయాయ్ కదా పెళ్ళి చూపులు.. హ హ.. ఎంత బావుంది ఈ భావన..

బ్రోకర్ అనుకుంటా సంచి, ఆల్బమ్స్ పట్టుకుని దిగాడు. “మరైతే నేను వాళ్ళకి ఫోన్ చేసి వస్తున్నాం అని చెప్తాను. సరేనా?” అని అడిగి బాబాయ్ చేత సరే అనిపించుకుని ఫోన్ చేశాడు..

“పూర్ణ ప్రసాద్ గారాండి…” ఒక్క సారిగా నా హార్ట్ బీట్ పెరిగినట్టనిపించింది.. పూర్ణ చంద్రరావ్ అని చెప్పింది హారిక. వీడేంటి ఇలా అంటాడు. వీడికి సరిగా తెలీదా? వీళ్లకి తెలీదు అనే భ్రమలో నాకేం తెలీట్లేదా.. ఇంక ఉపేక్షించ దలుచుకోలేదు. బ్రోకర్ భుజం మీద చెయ్యేసి బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళాను.

“సరిగా గంటలో అక్కడుంటామండి” అని పెట్టేశాడు ఫోన్.

“అమ్మాయి డిటైల్స్.. ” ఎక్కడ వినకూడని మాటలు వినాల్సి వస్తుందో అని ధైర్యం కూడగట్టుకుంటూ అడిగాను.

“అమ్మాయి పేరు హారిక. సాఫ్ట్‌వేర్ ఇంజినీరు గా చేస్తుంది బెంగుళూరు లో.. పూర్ణ ప్రసాదు గారని సా మిల్లు ఓనరూ.. బాగానే సంపాదించాడు. రెండో కూతురు. పెద్దమ్మాయికి……………”

ఒక్క సారిగా కాళ్ళలోంచి నరాలన్నీ కిందికి లాగేసి నేలకేసి కట్టేసినట్టయ్యింది. కదలలేక కూలబడి పోయాను.

“ఏమైంది బాబూ..” అన్నాడు.

తల అడ్డంగా ఊపాను.

“రే.. ఏమైంది రా..” కంగారు పడుతుంది అక్క.

తల మళ్ళీ అడ్డంగా ఊపి కాళ్ళలో సత్తువ తెచ్చుకుని లేచి నిలబడ్డాను.. ఇదెవరో హారిక అయితే తనెవరు.. రాత్రెందుకు లిఫ్ట్ అడిగింది.. ట్రైనెందుకు ఎక్కింది….

బ్రోకర్ బయటికెళ్ళిపోవడంతో కళ్ళల్లో ఎరుపు లా దాగి ఉన్న బాధంతా నీళ్ళు గా కారడం మొదలెట్టింది.. మంచం మీద కూలబడి కళ్ళు తుడుచుకున్నాను.

“ఏమైంది రా” పక్కన కూర్చుని తల మీద చెయ్యి పెట్టి అడిగింది అక్క.

“ఏరా బయల్దేరదామా?” బాబాయ్ అడుగుతున్నాడు బయటి నుంచే.

“వస్తున్నాడు బాబాయ్..” అని నా వైపు తిరిగి “తరవాత వెళ్దాం అని చెప్పనా?” అని అడిగింది. తన వైపు చూశాను గాని ఏమీ చెప్పలేకపోయాను.

అక్కే బయటకి వెళ్ళి బాబాయ్ తో ఏదో చెప్పి లోపలికొచ్చి పక్కన కూర్చుంది. చిన్నప్పట్నించి ఎన్నో బాధలకి ఓదార్పు ఇచ్చిన ఆ ఒడిలోనే తల పెట్టి పడుకున్నాను.

అక్క ఏం అడగట్లేదు.. నాకు చెప్పాలనిపిస్తుంది.. నేనే మొదలుపెట్టాను..

 

అంతా విని నవ్వింది.

“ఆ అమ్మాయిని పట్టుకుందామా అయితే?” అంది.

“వద్దక్కా.. తను లేకపోతే బతకలేను అనో, తనని ఎక్కడున్నా పట్టుకోవాలనో లేదు. కాని ఏదో డిసప్పాయింట్మెంట్ అంతే. చాలా మంది అమ్మాయిల్ని ట్రై చేద్దామా అనుకునే వాడ్ని. ట్రై చేసే వాడ్ని. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడెప్పుడూ ఇంత బాధ లేదు.. తను నాతోనే ఉన్నా అప్పటి వరకు లేని ఫీలింగ్ తను నాకు కాబోయే భార్య అనుకున్న తరవాత కలిగింది. అందుకే ఇంత బాధ. ఇప్పటి వరకు ఈ అమ్మాయిని భార్య అనుకుని ఒక గంటలో ఇంకో అమ్మాయిని అనుకోగలిగే ధైర్యం నాకు లేదు. అందుకే పెళ్ళి చూపులు వద్దన్నాను. అలా అని నేనేం దేవదాసు అయిపోను. కొంత టైం కావాలి అంతే.”

చెంప మీద మెల్లగా మూడు సార్లు కొట్టి తల నిమిరి, “నీ జీవితం లోకి ఆ అమ్మాయి ఎందుకొచ్చిందో తెలీదు. నాకైతే ఆ అమ్మాయి నీకు మళ్ళీ కనిపిస్తుంది అని నమ్మకం ఉంది. ఆ అమ్మాయి పాసింగ్ క్లౌడ్ కాదు. పాసింగ్ క్లౌడ్స్ వర్షించవు.. చూడు ఎంత వర్షం కురిసిందో” అని బుగ్గల మీద ఉన్న కన్నీటి చెమ్మని తుడిచి ఆ వేళ్ళు చూపించింది. అప్రయత్నంగా వచ్చిన చిరునవ్వుతో తన మొహం చూశాను.

“కాని ఆ అమ్మాయి పెళ్ళి చూపులక్కా”.. కొంచెం దిగులుగానే అన్నాను.

“ఒరే బుజ్జీ.. ఇవ్వాళ నీకూ పెళ్ళి చూపులే. జరిగాయా? అయినా చూపులన్నీ పెళ్ళిళ్ళవ్వవు రా!”

ఆ మాటలోనే ఒక ఆశ, ఒక హెచ్చరిక.

నా మనసు అర్ధం చేసుకోవడంలోనే కాదు, నా మనసుకు అర్ధం అయ్యేలా చెప్పడం లో కూడా అక్కే టాపర్…. సిలబస్ మారినా సరే..

ప్రకటనలు
 
వ్యాఖ్యానించండి

Posted by పై డిసెంబర్ 21, 2015 in కథలు

 

గులాబ్ జామ్

ఆన్‌సైట్ చాన్స్ కోసం ఒంటి కాలి మీద కొంగ జపం చేయగల సమర్థులున్న మా బ్యాచ్ లో నాకే అవకాశం రావడం వాళ్ళందర్నీ బాధకి గురి చేసింది. నన్ను ఆనందం ఆవరించింది. కాని ఆ ఆనందం కేవలం వాళ్ళ బాధను చూసి మాత్రమే. అవకాశాన్ని చూసి కాదు. ఐటి ఉద్యమంలో సంవత్సరంన్నర అనుభవం ఉన్నా ఈ కంపెనీ లో జాయినయిన మూడు నెలల్లో నేర్చుకున్న జీ-మెయిల్, ఆర్కుట్ అనుభవం ఆన్‌సైట్లో ఎంతవరకు సరిపోతుందో అని టెన్షన్. నాతో పాటు రూమ్మేట్ ప్రణీత్ గాడికి కూడా అవకాశం రావడం వల్ల కష్టం అయితే ఒకడు తోడుంటాడని ఆనందం, సుఖం అయితే ఆడికి కూడా దక్కేస్తుందని కుళ్ళు కలిగాయి. కాని కుళ్ళు కంటే ఆనందమే ఎక్కువ కలగడంతో వాడు రావడాన్ని, వాడితో వెళ్ళడాన్ని మనస్పూర్తిగా స్వాగతించాను.  అక్కడికెళ్ళినా ఇక్కడి పనే అని మా మేనేజర్ జీ-మెయిల్ లో పింగ్ చేసి ఇచ్చిన భరోసా ని లగేజ్ లో కుక్కుతుంటే వంశీ గాడొచ్చాడు. వీడంటే అందరికీ మహా మంట. సుడి గాడు అని పిలవబడే వీడు ఎక్కడ కాలు పెట్టినా కాలి కంటే ముందు తోక పెట్టుకుని ఒక నక్క సిద్దం గా ఉంటుంది. జాయిన్ అయిన వారానికే ఆన్‌సైట్ వెళ్ళొచ్చి కటింగులు దొబ్బుతూ ఉండే వాడు.  “ఆ భరోసాలు, సమోసాలు బ్యాగ్ లో పెట్టకు. అవి అక్కడ కావల్సినన్ని దొరుకుతాయ్.. రైస్ పెట్టుకో” అన్నాడు. Read the rest of this entry »

 
44 వ్యాఖ్యలు

Posted by పై డిసెంబర్ 10, 2011 in Uncategorized