RSS

గులాబ్ జామ్

10 డిసెం

ఆన్‌సైట్ చాన్స్ కోసం ఒంటి కాలి మీద కొంగ జపం చేయగల సమర్థులున్న మా బ్యాచ్ లో నాకే అవకాశం రావడం వాళ్ళందర్నీ బాధకి గురి చేసింది. నన్ను ఆనందం ఆవరించింది. కాని ఆ ఆనందం కేవలం వాళ్ళ బాధను చూసి మాత్రమే. అవకాశాన్ని చూసి కాదు. ఐటి ఉద్యమంలో సంవత్సరంన్నర అనుభవం ఉన్నా ఈ కంపెనీ లో జాయినయిన మూడు నెలల్లో నేర్చుకున్న జీ-మెయిల్, ఆర్కుట్ అనుభవం ఆన్‌సైట్లో ఎంతవరకు సరిపోతుందో అని టెన్షన్. నాతో పాటు రూమ్మేట్ ప్రణీత్ గాడికి కూడా అవకాశం రావడం వల్ల కష్టం అయితే ఒకడు తోడుంటాడని ఆనందం, సుఖం అయితే ఆడికి కూడా దక్కేస్తుందని కుళ్ళు కలిగాయి. కాని కుళ్ళు కంటే ఆనందమే ఎక్కువ కలగడంతో వాడు రావడాన్ని, వాడితో వెళ్ళడాన్ని మనస్పూర్తిగా స్వాగతించాను.  అక్కడికెళ్ళినా ఇక్కడి పనే అని మా మేనేజర్ జీ-మెయిల్ లో పింగ్ చేసి ఇచ్చిన భరోసా ని లగేజ్ లో కుక్కుతుంటే వంశీ గాడొచ్చాడు. వీడంటే అందరికీ మహా మంట. సుడి గాడు అని పిలవబడే వీడు ఎక్కడ కాలు పెట్టినా కాలి కంటే ముందు తోక పెట్టుకుని ఒక నక్క సిద్దం గా ఉంటుంది. జాయిన్ అయిన వారానికే ఆన్‌సైట్ వెళ్ళొచ్చి కటింగులు దొబ్బుతూ ఉండే వాడు.  “ఆ భరోసాలు, సమోసాలు బ్యాగ్ లో పెట్టకు. అవి అక్కడ కావల్సినన్ని దొరుకుతాయ్.. రైస్ పెట్టుకో” అన్నాడు. “రైసా? రైసేంది? అక్కడేది దొరికితే అదే తింటం. ఈడకెళ్ళి రైస్ తీస్కెళ్ళి తింటున్నార్రా అందరూ?” ప్రణీత్ గాడి ధైర్యం బావుంటుంది. “నా మాట విని 45డేస్ కి ఇద్దరికి 10 కేజీల రైస్ తీసుకెళ్ళండి. అక్కడ దొరికే ఫుడ్ మనం తినలేం. తరవాత ఏడుస్తారు. అనుభవించి చెప్తున్నాను అర్థం చేసుకోండి” వంశీ గాడిలో ఒక స్వామిజీ ని చూస్తూ తల ఇటు తిప్పితే ప్రణీత్ గాడిలో ఒక నాయకుడు కనిపించాడు. వీడి నాయకత్వం లో నడిచేస్తే మనకి టెన్షన్ తగ్గుద్ది. “నీ లెక్క మాకు వెజ్ తినాల్సిన అవసరం లేదు కదా. అవసరం లేదు బే” అన్నాడు. నేను మా వాడి కేప్టెన్సీని పూర్తిగా ఆమోదించడంతో నేనేం మాట్లాడట్లేదు. కాని మనసులో మనసు గొణుగుతుంది. “అక్కడ అన్నం దొరక్కపోతే అక్కడే పోతావ్. నీదేమైనా పొట్టి శ్రీరాములు బాడీనా?. ఆఫ్ట్రాల్ కేసీఆర్ బాడీ. తేల్చుకో” అని. సరే అని దానికి చెప్పి వీడికి చెప్పా కొంచెం తీస్కెల్దాం రిస్క్ ఎందుకు అని. ప్రణీత్ గాడిలో నాకు నచ్చేది అదే. ఏదీ స్ట్రైట్ గా ఒప్పుకోడు. “నువ్వో లత్తుకోరు గాణివి ఆడేదో చెప్తడు.హ్మ్……. సరే పెడదం” అన్నాడు. మొత్తానికి ఎనిమిది కేజీల రైస్, కొన్ని పచ్చళ్ళు, పొడులు లగేజ్ లో పెట్టడానికి నిర్ణయించుకుని ఆరు కేజీల రైస్, పచ్చళ్ళు పెట్టాం, మళ్ళీ బరువు ఎక్కువైతే కస్టమ్ అని.

ఇజ్రాయేలు ఆన్‌సైట్ ఏంట్రా అని అడిగిన స్నేహితులకి, కుటుంబానికి సావధాన-సమాధానం ఇచ్చుకుని ఆన్‌సైట్ చేరుకున్న మాకు భూతల స్వర్గం కనిపించింది. స్వర్గం ఇంతలా డెవలప్ అయిందో లేదో మరి. ప్లే గ్రౌండ్ అంత విస్తారం గా రోడ్లు, ఇండియా ఆఫీస్ లో చలికాలం మాత్రమే పెట్టే ఏసీ అంత చల్లని వాతావరణం…  మా మేనేజర్ చెప్పినట్టే అక్కడి మేనేజర్ మాకు జీ-మెయిల్,ఫేస్బుక్ ఇంకా బాగా నేర్పించి మీకు వర్క్ లేదు ఇప్పట్లో అని చెప్పడంతో మేం పని వచ్చినప్పుడు పనికొస్తాయని అవే బాగా ప్రాక్టిస్ చేసే వాళ్ళం. ఇంత ఆనందం లోనూ మాకు రోజూ మూడు సార్లు ఆంధ్రా దేవుళ్ళు గుర్తొచ్చే వారు. అదేంటో గాని ఇండియా లో ఉన్నప్పుడు మాకు ఇష్టమైన తిండి వేళలు ఇక్కడ కష్టంగా మారాయి. ఇండియా లో తినడానికే బతికే వాళ్ళం ఇక్కడికొచ్చాక బతకడానికి తినడం మొదలు పెట్టాం. బతకడానికి కూడా కాదు చావకుండా ఉండటానికి. ఉదయం లేవగానే బ్రేక్‌ఫాస్ట్ చెయ్యాలంటే భయం, కక్కేసుకుంటానేమో అని. అవీ ఇవీ వెతికి ఒకటో రెండో కుకీస్ కుక్కేసుకుని హోటల్ ‘భయ’టపడే వాళ్ళం. ఆఫీస్ లో లంచ్ టైం లో నాలుగు రకాల చికెన్ ఐటమ్‌స్  అందుబాటులో ఉండేవి. హాఫ్ బాయిల్డ్, బాయిల్డ్, కాల్చినది, ఈకలు పీకినది (అంటే కాల్చనిది). ఒక రోజు తెలీక హాఫ్ బాయిల్డ్ తెచ్చి ప్లేట్లో పెట్టుకుని ఫోర్క్ దాంట్లో గుచ్చిన పాపానికి 2 వాంతుల శిక్ష వేశాడు దేవుడు. ఇంతటి ఘోర అనుభవాల మధ్య వెజిటేరియన్స్ గా మారదాం అనే కఠిన నిర్ణయాన్ని తీసుకుని పాటించడం మొదలు పెట్టాం. యోగర్ట్ అనబడే ఫ్లేవర్డ్ కర్డ్ నా ఫేవరెట్ అయిటం గా ప్రకటించడంతో, చుట్టూ చూసి బంగాళా దుంప ఫ్రయంస్ ని వాడి ఫేవరెట్ అయిటం గా ప్రకటించాడు ప్రణీత్ గాడు. ఆ విధంగా పగలంతా మా ఆహార దరిద్రాన్ని అనుభవించి రూం చేరుకున్నాక మైక్రో వేవ్ ఒవెన్ లోనే అన్నం, పప్పు చేసుకుని, ఎప్పుడో ఆర్ణెళ్ళ క్రితం వచ్చి పాతుకుపోయిన శ్రవణ్ గాడితో కలిసి, వాడు ఆర్ణెల్ల క్రితం తెచ్చినా ఇప్పటికీ ఫ్రెష్ గా ఉన్న పొడులు పచ్చళ్ళు కలుపుకుని(మేం అప్పుడే తీస్కెళ్ళిన పచ్చళ్ళు పాడయిపోతే పడేసి) వేడి వేడి అన్నం తిని నిజమే స్వర్గం లో ఉన్నాం అనుకుని హై-ఫై లు కొట్టుకుని చంకలు గుద్దుకునే వాళ్ళం. ఒక వారానికి బద్దకం, రెండో వారానికి నీరసం, మూడో వారానికి బెంగ మొదలయిపోయాయి. ఎలా అయితే ఒక నెల పూర్తి చేశాం అనే ఆనందంలో పక్కనే ఉన్న ఇండియన్ రెస్టారెంట్ లో పది రోజుల భోజనానికి సరిపోయే డబ్బుల్తో సగం కడుపు నిండా బిర్యాని తిని పార్టీ కూడా చేసుకున్నాం.

మీకు పని మొదలయింది అన్నాడు మా మేనేజర్. సంతోషం. ఏమైనా మైల్స్ పంపాలా? ఎవరికైనా పింగ్ చెయ్యాలా? అని అడిగా. కాదు బగ్ ఫిక్షింగ్ అన్నాడు. అంటే ఏంటన్నాను. రోజుకో బగ్ చెప్తా. దాన్ని పట్టుకుని చంపాలి అన్నాడు. ఒకటేనా అన్నాను. ఈ రోజు సెవ్ ఒన్ బగ్,నార్త్ బ్లాక్ లో ఉంటుంది పట్టుకో చూద్దాం  అన్నాడు. “?” అన్నాను. ఎర్రగా ఉంటుంది అన్నాడు. ఏంటీ, పెసర గింజంత ఉండే బగ్ ని ఇంత పెద్ద బ్లాక్ లో పట్టుకోవాలా? అదీ ఒక రోజులో? సరే అని వెతగ్గా వెతగ్గా చివరికి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే టైం లో ఒక మూల ఉన్న చెత్తకుప్పలో దొరికింది. దాన్ని తీసుకెళ్ళి దొరికింది చంపేయనా అన్నాను. ఆగాగు అన్నాడు. వాడు చంపుతాడేమో అని వాడి చేతిలో వేశా. వాడు మళ్ళీ నా చేతిలో వేసి, “ఇది ఎవరి చెత్త బుట్టలో అయితే దొరికిందో వాడ్ని సంప్రదించు. ఇది నీదేనా? ఎందుకిలా చేశావ్? కారణం ఉందా? కండ కావరమా? అన్నీ కనుక్కో. వాడు నాదే కండ కావరమే అన్నాడనుకో చంపెయ్. లేదూ దాన్ని నేను పెంచుకుంటున్నాను అన్నాడనుకో, అప్పుడు ఈ బగ్ ఉందని కంప్లైంట్ ఇచ్చిన వాది దగ్గరకి వెళ్ళు. వాడికి చెప్పు ఇది పెంపుడు బగ్గు, దీన్ని చంపడం కుదరదని చెప్పు. వాడి కంప్లైంట్ వాపసు తీసుకోమని చెప్పు” అన్నాడు. ఇప్పుడా, రేపా అని అడిగితే ఎగా దిగా చూశాడు. ఆంధ్రా లో ఎటకారం ఇక్కడ కూడా ఎటకారమే అని అర్థమయింది. వాడితోనూ వీడితోనూ మాట్లాడి పెంపుడు బగ్ అని డిసైడ్ చేసే సరికి ఆకలి పది రెట్లయింది. టైం పదయ్యుంటుంది అని రూం కి పరిగెత్తి ఏదైనా తిందాం అని ప్రణీత్ గాడ్ని అంటే ఏదైనా తినడానికి ఇదేమైనా ఇండియానా? అన్నం వండుకుందాం అని రైస్ కవర్ లో చెయ్యి పెట్టి ఒర్రే అన్నాడు. అయిపోయాయన్నమాట. వంశీ గాడి మాట వినకపోవడం వల్ల ఆకలి బాధ ఒకటి. వాడేదో గొప్ప వాడిలా మాకు అనిపిస్తున్నందుకు చిరాకొకటి. ఏం తిందాం అంటే శ్రవణ్ గాడి ఆన్సర్ ఫలాఫెల్. ఒకసారి తిన్నాను. పర్వాలేదనిపించే ఒకేఒక ఇజ్రాయేలి ఐటం. ఎక్కడ అంటే 3 కిలోల మీటర్లు మాత్రమే. పడుతూ లేస్తూ చస్తూ బతుకుతూ వెళ్ళి తినొచ్చి పడుకుంటే రాత్రి 12 అయింది. లేస్తే ఉదయం 10 అయింది.

మళ్ళీ క్యాబ్లో పడి ఆఫీస్ లో పడితే ఇంకో సెవ్ త్రీ పచ్చ బగ్గు. పచ్చది కదా అని మంచిదేం కాదు. ఇది ఇంకా దొంగ రకం. అసలు దొరకదు. దొరికినా ఎవడూ నాది అని ఒప్పుకోడు. ఒప్పుకున్నా ఏం చెయ్యాలో చెప్పడు. పెంచుకుంటావా అంటే ఏమో అంటాడు.  జీవితంలో ఒకే కష్టం మళ్ళీ మళ్ళీ రావడం జరిగితే దురదృష్టం అంటారు. ఇన్ని కష్టాలు ఇన్ని రోజులు వెంటాడితే దురదృష్టం అనడానికి కూడా భయపడతారు. అన్నందుకు వాళ్ళకి పట్టుకుంటుందేమో అని. ఇక్కడికొచ్చిన కొత్తలో నిమ్మకాయ పిండి తోడు పెట్టిన పెరుగు రోజూ రేపటి పెరుగుకి తోడయ్యేది. కాని అదీ అవ్వడం మానేసింది. నిమ్మ కాయ పిండితే వెక్కిరిస్తూ విరిగిపోయింది. లోకల్ లో రైస్ దొరుకుతుంది అని ఎవడో చెప్తే తెచ్చి వండిన అన్నం అంటించడానికి వాల్పోస్టర్లు లేక వేస్ట్ అయిపోయింది. ఆకలి, పని, నిద్ర అన్ని రకాల కష్టాలు ఈదుకుంటూ ఒక వీక్ గడిపిన మాకు కనీసం నిద్రైనా తీర్చుకోండి అని వీకెండ్ వచ్చింది. అంతకు ముందు వీకెండ్ వస్తే ఎక్కడికీ వెళ్ళకపోతే వేస్ట్ అన్నట్టు ఫీల్ అయిన మేము ఈ వీకెండ్ నిద్రాదేవితో మాత్రమే గడపాలని నిశ్చయించి ఒకడ్నొకడు డిస్టర్బ్ చేస్తే చంపేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చేసుకున్నాం. ఏదో కక్కుర్తి పడ్డాం కాని మరీ 24 గంటలు కూడా నిద్ర పోలేక 20 గంటలకే రూం లోంచి బయట పడి హోటల్ పక్కనే ఉన్న మద్యధరా సముద్రం ఒడ్డుకెల్దాం అని బయల్దేరాం.

మా దరిద్రం గురించి నవ్వుకుంటూ, ఓపిక లేని అడుగులతో నడుచుకుంటూ వెళ్తున్న మాకు ఇంకో రెండు నీరసం నడకలు తోడయ్యాయి. మన దేశమే గాని మన బాష కాదు. ప్రణీత్గాడికి వచ్చి, నాకు రాని హిందీలో పరిచయం చేసుకుని ఫ్రెండ్స్ అయిపోయాం. మా హోటలేనట. ఒక చోట బిర్యాని బావుంటుంది వెళ్దాం అన్నారు. సై అన్నం తిని చాలా రోజులయింది. నడక మొదలైంది హుషారుగా. కొంచెం దూరం నడిచాక ఏవో పాటలు వినిపిస్తున్నాయ్. ఇంకొంచెం దూరం వెళ్ళాక క్లారిటీ వచ్చింది. అది హరే రామ హరే కృష్ణ భజన. కొత్తగా పరిచయమైన వాళ్ళలో ఒకతనికి భలే సంతోషం వేసింది. మన హిందూ మతానికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులున్నారు అని అటుగా నడిచాడు. అది ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యం లో నడుస్తున్న భజన కార్యక్రమం. అందరూ ఇజ్రాయేల్ జాతీయులే. “హరే రామ హరే రామ రామ రామ హరే హరే.. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..”  కి ఎంతో హుషారుగా గెంతుతున్నారు. మమ్మల్ని చూడగానే ఇండియన్స్ గా గుర్తించి మమ్మల్నీ లాగి కలిపి ఒక అరగంట గెంతారు. ఆగితే ఆగనివ్వట్లేదు. ఆపితే ఆపనివ్వట్లేదు. మొత్తానికి ఎలాగోలా తప్పించుకుని పక్కనే ఉన్న మెట్టు మీద కూలబడితే ప్రణీత్ గాడు “నీ…” అన్నాడు. “నీరసం” అందాం అనుకున్నాడేమో, ఉన్న రసం కూడా పిండేశారు. భజన ముగించి మూటా ముల్లె సర్దుతున్నారు. మనం వెళ్దాం బిర్యాని కి అని బయల్దేరుతుండగా మా దగ్గరకి ఒక ఇస్కాన్ సభ్యుడు వచ్చాడు. “దగ్గర్లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. అక్కడ భజన చేస్తాం. మీరు కూడా రావచ్చు. ప్రసాదంగా ఇండియన్ మీల్స్ కూడా పెడతాం………” ఎదో చెప్తున్నాడు. ఇండియన్ మీల్స్ అనే మాట బాగా నచ్చింది నాకు. మేమిద్దరం మొహాలు చూసుకున్నాం. వీడికి మాత్రం నమ్మకం లేనట్టుంది. నార్త్ ఇండియన్స్ ఇద్దరూ వెళ్దాం అన్నారు. ఇందాక ఆ ఇస్కాన్ అతను అన్న దాంట్లో “ఇండియన్ మీల్స్” కాకుండా ఇంకోటేదో ఇంటెరెస్టింగ్ పదం ఉంది. అదేంటో గుర్తు రావట్లేదు. ప్రణీత్ గాడు ఏదో చెప్తూనే ఉన్నాడు “….గులాబ్‌జాం పెడతాడంటావా? నాకు నమ్మకం లేదు”. హా… గులాబ్‌జాం. ఇదే సెకండ్ ఇంటెరెస్టింగ్ పదం. నరసాపురం కృష్ణా స్వీట్స్ లో గులాబ్‌జాం కి ఎంత జ్యూస్ ఇస్తాడో అంత జ్యూసూ నోట్లో ఊరింది.

నడక మొదలయింది. నా కళ్ళు టెంపుల్ స్ట్రక్చర్ కోసం వెతుకుతున్నాయి. కనపడట్లా. 4 కిలో మీటర్లు నడిచే ఉంటాం. కాని జాడలేదు. తిరిగెళ్ళేటప్పటికి ఉంటది అసలు మజా అంటున్నాడు ఒక నార్త్ ఇండియన్. ఒక సందులోకి తీసుకెళ్ళి ఒక పాతకాలం అపార్ట్మెంటులోకి తీసుకెళ్ళారు. అది ఒక ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్. కాని ఆ గదికి చేసిన అలంకరణ అద్బుతం గా ఉంది. కొన్ని వందల కృష్ణ ప్రతిమలతోనూ, చిత్ర పటాలతోనూ నింపేశారు. ఆ ఫ్లాట్ ఒక కృష్ణ భక్తురాలిదని ఆమె కృష్ణుడు వచ్చి పెళ్ళి చేసుకుంటాడని ఎదురు చూస్తుందని చెప్పారు. ఆమెని చూపించారు. అమ్మాయి చాలా అందంగా ఉంది. “ఈ రోజుల్లో కూడా ఏంటీ నమ్మకాలు?”. “ఎవరి నమ్మకాలు వాళ్ళవి.” ఏదో మాట్లాడుకుంటున్నారు ‘మాలాంటి కాని’ భక్తులు. నిజానికి మా మనసు కృష్ణుడి మీద కంటే ప్రసాదం మీద ఎక్కువ ఉంది. మాతో పాటు వచ్చిన ఇస్కాన్ బృందం లోపలికెళ్ళి మొహాలు కడుక్కుని వచ్చినట్టున్నారు. అక్కడికీ మా వాడు అడిగాడు ప్రసాదం ఎప్పుడు పెడతారు అని. అతను చెప్పాడు భజన అయ్యాక అని. సంగీత వాయిద్యాలు తెచ్చి భజన మొదలెట్టారు. “హరే రామ హరే రామ రామ రామ హరే హరే… హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే”… మళ్ళీ ఇదేనా? ఇందాకే కదా అంత సేపు పాడారు. రాముడు కృష్ణుడు మొహాలు చూసుకుంటున్నారేమో పైన. ఇద్దరూ ఒకటే కదా. ఏమో.. గులాబ్ జామ్స్ పెట్టేటప్పటికి ప్రణీత్ గాడికి తలనొప్పొస్తే బావుణ్ణు. రెండు తినచ్చు. ఒకే లైన్ రెపీట్ చేస్తూ ఒక గంట పాటు సాగింది భజన కార్యక్రమం.  ఈ భజన మధ్యలో కృష్ణుని కోసం ఎదూరు చూస్తున్న అమ్మాయి కన్నీరు పెట్టుకోవడం పక్కనున్న అమ్మాయిలు ఓదార్చడం 2-3 సార్లు జరిగింది. భజన అవ్వగానే భోజనాలు అంటారేమో అని చూశాను. ప్రవచనం లాంటిది మొదలయింది. భగవద్గీత నుంచి ఒక శ్లోకం తీసుకుని దాని అర్థం హెబ్రూలో వివరిస్తున్నాడు ఒకాయన. దాని మధ్యలో తన సొంత వివరణలు ఇచ్చుకుంటూ అందర్నీ నవ్విస్తున్నాడు. కొందరు ఆయన్ని ప్రశ్నలడిగారు. ఆయన సమాధానాలకి సంతోషించి నమస్కరించారు. ముక్క అర్థం కాకపోయినా ఈ సీన్ ఇండియాలో జరిగే హిందూ, క్రిష్టియన్ మత ప్రవచనాలను గుర్తు చేసింది. ఇలా ఒక 45 నిముషాలు గడిచాక గుర్తొచ్చింది ఆకలనేది మన లాగ వెయిట్ చెయ్యదని చచ్చిపోతుందని. తరవాత మళ్ళీ అనూహ్యంగా భజన అన్నారు. భజనన్న ప్రతీసారీ పాడే ఒకే ఒక లైన్ ని వాళ్ళకొచ్చిన అదే యాక్సెంట్ లో పాడుకుంటూ ఒక గంట తన్మయత్వం లో గడిపేశారు. చేతులు కడుక్కు రండి ప్రసాదం అన్నారు. మేమిద్దరం అందరికంటే ముందే ఉన్నాం. మా కరువు, కక్కుర్తి చూసిన వాడెవడికైనా తెలుస్తుంది తిని చాలా కాలం అయిందని.

చక్కగా సాంప్రదాయ బద్దం గా అరిటాకుల్లాంటి ఆకులు వేశారు. ఇవేం ఆకులు అన్నాడు. అరిటాకులు దొరకవ్ కదరా దాని కజిన్ ఏమో అన్నాను. ఒక స్వీట్ లాంటిదేదో పెట్టారు. చేత్తో టచ్ చేసినప్పుడు జిగురు గానూ, నాలుకతో టచ్ చేసినప్పుడు వగరు గాను అనిపించి తిననే లేదు. ఇంకో ఐటం వస్తుందిలే అని ఎదురు చూస్తున్న మా కంచాల్లో అన్నం లాంటి పదార్ధం ఏదో పడింది. మళ్ళీ జిగురు. హా.. వాల్‌పోస్టర్ జిగురు. హమ్మో నాకొద్దు. మరి ఆకలి. సరేలే తిందాం. ఇందులో కలుపుకోవడానికి ఏదైనా తెస్తారా? చూస్తున్నాం మేం నలుగురం. ఏదో తెచ్చారు. పచ్చి పులుసు లాంటిది. ఆకులో పోశాడు. పచ్చి కూరగాయలు వేడి నీటిలో వేసి కొద్ది గా ఉప్పు వేసి తెచ్చినట్టున్నారు. పేరేదో ఉండే ఉంటుంది. చెప్పలేదు. మేం తినలేదు. మేం నలుగురం ఇంకా అటే చూస్తున్నాం. ఇంకేదైనా ఐటం రావచ్చు… మేం ఎదురు చూసే మెయిన్ ఐటం గులాబ్‌జాం రావచ్చు. రాలేదు. అందరూ గోవింద కొట్టేసారు. ఇద్దరు ఇస్కాన్ సభ్యులు రెండు తట్టలు తీసుకుని వరసగా వస్తున్నారు. ఒక బుట్ట పెద్దది. ఒక బుట్ట చిన్నది. పెద్ద బుట్టలో విస్తరి వేసి, చిన్న బుట్టలో డబ్బులు వెయ్యాలి. విరాళం. నా వంతు వచ్చింది. నా దగ్గరున్న కాయిన్స్ లో లీస్ట్ డినామినేషన్ కోసం వెతికితే 20 షకిల్స్ దొరికింది. దేవుడికిచ్చాం అనుకో అని మనసుకి నచ్చచెప్పి చిన్న తట్టలో వేసేసాను. నా పక్కన కూర్చున్న ఇన్‌స్పైర్డ్ నార్తి ఇండియన్ 100 షకిల్స్ వేశాడు. ప్రణీత్ గాడు నాలానే లీస్ట్ వెతికాడు. వాడి అదృష్టం 5 షకిల్స్ ఉంది వాడి దగ్గర. అది వేశాడు. “నో.. మినిమం 20 షకిల్స్” అంది చిన్న బుట్ట తీసుకొస్తున్న అమ్మాయి. 20 షకిల్స్ అంటే 2 ఫలాఫెల్‌లు వస్తాయి. కడుపైనా నిండునేమో. ఇంతలో మా నార్త్ ఇండియన్ అడిగాడు “గులాబ్‌జాం ఏది?” అని. “మీకు వేసిన ఫస్ట్ ఐటం అదే కదా!!” అంది. మనసు నవ్వమంటే శరీరం సహకరించని క్షణాలు అనుభవించాం. జీవితానికి ఇంతకన్నా ఆకలి కామెడి మళ్ళీ దొరుకుద్దో లేదో తెలీలేదు. కాళ్ళు ఈడ్చుకుంటూ, శ్రవణ్ గాడికి ఫోన్ చేసి ఏడ్చుకుంటూ అంతా చెప్పి, హొటల్ లో పడ్డాం. శ్రవణ్ గాడు తెచ్చిన ఫలాఫెల్ తిని వాడు నవ్విన నవ్వులు విని ఎప్పుడు పడుకున్నామో ఎప్పుడు లేచామో తెలీదు. ఆ కసిలో మరుసటి రోజు హోటల్ కి దూరం గా ఉన్న ఇండియన్ రెస్టారెంట్ మీద పడి తెగ తినేశాం. ఆ తృప్తిని కొంచెం కొంచెం అనుభవిస్తూ ఇంకొక్క వారం కూడా గడిపేసి హైదరాబాదు లో దిగగానే ఎఱ్ఱగడ్డలో తిన్న గులాబ్‌జాం టేస్ట్ మళ్ళీ ఎక్కడ తిన్నా రాలేదు. మళ్ళీ అక్కడ తిన్నా రాలేదు. ఇదే విషయం చెప్తే గోపి గాడన్నాడు “మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళు. వచ్చాక తిందువు గాని బావుంటుంది” అని.. “{o_o}”

ప్రకటనలు
 
44 వ్యాఖ్యలు

Posted by పై డిసెంబర్ 10, 2011 in Uncategorized

 

44 responses to “గులాబ్ జామ్

 1. రహ్మానుద్దీన్ షేక్

  డిసెంబర్ 10, 2011 at 8:02 సా.

  ఏమో మరి…
  అన్నం పరబ్రహ్మ స్వరూపమన్న విషయం ఇలాంటప్పుడే తెలుస్తుంది.

   
 2. Praveen Sarma

  డిసెంబర్ 10, 2011 at 8:03 సా.

  “సైన్స్ విజ్ఞానం ఇంత పెరిగిన తరువాత కూడా ఇలాంటి చిల్లర నమ్మకాలని నమ్ముతున్నారా?”

   
  • నచకి (NaChaKi)

   డిసెంబర్ 13, 2011 at 12:25 సా.

   మొత్తం టపాలో మీకు అదొక్కటే కనిపించిందా! మీరు పరమ సూపరు… మానవరూపంలో (?) ఉన్న అదేదో సమ్…బూతులు!

    
   • pradyu

    డిసెంబర్ 14, 2011 at 6:31 ఉద.

    climax lO vachina gulaab jamun kOsam inta katha vRaasaru anTE abhinandinchaalisinde…of course, inta chadivaaka, naku neerasam vachEsindi.entaaina EDaari dESamE kada idhe kuDaa.

     
 3. అయినవోలు ప్రణవ్

  డిసెంబర్ 10, 2011 at 8:42 సా.

  హహహ… భలే నవ్వించేశావ్ మూర్తి ఇవాళ్ళ నన్ను… చాలా బాగుంది మీ ఇజ్రాయిల్ జర్నీ విశేషాలు. 🙂

   
 4. Vasu

  డిసెంబర్ 11, 2011 at 12:23 ఉద.

  బావుంది మూర్తీ.. అంటే మీ పోస్ట్ మీ బాధలు కాదు.
  ఇస్కాన్ వాళ్ళు ఇక్కడైతే ప్రసాదం బాగా పెడతారు. చందాలు ఏం ఆశించారు. అక్కడ కొంచం కమర్షియల్ అయిపోయారో ఏంటో ?

  ఈ సారి ఇక్కడికి (యూ ఎస్ ) ఆన్సైట్ పంపితే బావుండు. ఫుడ్ గొడవ ఉండదు.

   
 5. hari

  డిసెంబర్ 11, 2011 at 3:58 ఉద.

  amdocs lo bugs fix chese vidhanam baga cheppav ga

   
 6. మోహన

  డిసెంబర్ 11, 2011 at 4:41 ఉద.

  >>పడుకుంటే రాత్రి 12 అయింది. లేస్తే 10 అయింది.
  >>2 వాంతుల శిక్ష వేశాడు దేవుడు.
  >>పని వచ్చినప్పుడు పనికొస్తాయని అవే బాగా ప్రాక్టిస్ చేసే వాళ్ళం
  >>దేవుడికిచ్చాం అనుకో అని మనసుకి నచ్చచెప్పి
  >>ఇదే విషయం చెప్తే గోపి గాడన్నాడు “మళ్ళీ ఇజ్రాయెల్ వెళ్ళు. వచ్చాక తిందువు గాని బావుంటుంది” అని.. “{o_o}”
  :)))))))))))))

  ఇలా ఇంకా చాలా ఉన్నాయి నాకు నచ్చిన లైన్స్.
  మంచి nativity feel. ఎప్పుడో మర్చిపోయిన గోదారి యాస, మాట్లాడే స్టయిల్, అందులో ఆలోచనలు మాటల్లోనో , చేతల్లోనో పెట్టేప్పుడు అంతర్లీనంగా పండి గిలిగింతలు పెట్టి నవ్వించే original భావుకత. 🙂 Too good. Keep going.

  బెంగళూరులో సాగరం, తీరం లేవు. ఈ సాగరతీరం create చేసిచ్సినందుకు Thanks 🙂

   
 7. avinEni bhAskar

  డిసెంబర్ 11, 2011 at 8:08 ఉద.

  అదర్గొట్టేశావు, మూర్తీ! మీ కంపినీ వాడికీ, నీకూ ఈ ఆన్‌సైట్‌వల్ల లాభం కలిగిందోలేదో గానీ తెలుగు బ్లాగర్లకు మాత్రం చాలా లాభం జరిగిందోయ్ 🙂

  కుటుంబ సమేతంగా నవ్వుకున్నాము 🙂

  పోస్ట్ మొత్తాన్నీ కామెంట్లో పేస్ట్ చేసి అభినందించడం ఎందుకులే అని చెయ్యలేదు. టూ గుడ్.. కీప్ ఇట్ అప్…

   
 8. వేణూశ్రీకాంత్

  డిసెంబర్ 11, 2011 at 10:15 ఉద.

  భాస్కర్ అన్నట్లు మీ అన్ సైట్ ట్రిప్ వల్ల మాకు పెద్దలాభమే కలిగింది 🙂 టపా చాలాబాగుంది, ఈ బ్లాగింగ్ ను ఇలానే కొనసాగించండి. ఆకలి కష్టాలు చదువుతూ నవ్వుకునేపుడు నాకు ఆకలిరాజ్యంలో లేని అన్నంతింటున్నట్లు నటించే సీన్ గుర్తొచ్చింది.

   
 9. నీహారిక

  డిసెంబర్ 11, 2011 at 12:20 సా.

  very nice narration, cut the post into small paragraphs, it’s lengthy to read.

   
 10. రాజ్ కుమార్

  డిసెంబర్ 11, 2011 at 1:41 సా.

  అరాచకం అండీ.పోస్ట్ కుమ్మేశారు.. సూపరో సూపరు…
  తెగ నవ్వుకున్నా…

   
 11. సుధ

  డిసెంబర్ 11, 2011 at 3:30 సా.

  చాలాబాగా రాసారు.
  సుడి గాడు అని పిలవబడే వీడు ఎక్కడ కాలు పెట్టినా కాలి కంటే ముందు తోక పెట్టుకుని ఒక నక్క సిద్దం గా ఉంటుంది
  మళ్ళీ బరువు ఎక్కువైతే కస్టమ్…అని – లాంటి వాక్యాలు మీ రచనలోని స్పార్క్ చూపిస్తున్నాయి.
  (అన్నంకోసం మీరు పడిన బాధ చూసి మాత్రం ఒక తల్లిగా హృదయం ద్రవించిపోయిందనుకోండి) మొదటిపేరాలో మీరు రాసిన విధానం మాత్రం ఎంతో చక్కగా ఉంది. ఇంకా రాయబోయే వాటికోసం ఎదురుచూస్తాను.

   
 12. kiran

  డిసెంబర్ 11, 2011 at 4:01 సా.

  చాలా చాలా బాగుంది మూర్తి..!! 🙂
  బాగా నవ్వుకున్నా… 😀
  మళ్లీ ఇజ్రాయెల్ ఎప్పుడేల్తున్నారు ?

   
 13. lalitha

  డిసెంబర్ 11, 2011 at 5:01 సా.

  hahaa…………nEnu usa vaccina toli rOjulu gurtoccaayi.flight lO uDikincina aalu, konni pacci kooralu peTTAru.
  inTiki raagaanE aavakaaya vEsukuni tinTE kaanii naa praaNam lEci raalEdu

   
 14. అప్పారావు శాస్త్రి

  డిసెంబర్ 12, 2011 at 3:58 ఉద.

  లైను లైను నవ్వుకున్నాం
  చాలా బాగా రాసారు
  ఇంకా శాఖాహారులకి ఎలా ఉంటుందో కదా 😦

   
 15. బులుసు సుబ్రహ్మణ్యం

  డిసెంబర్ 12, 2011 at 4:47 ఉద.

  చాలా బాగుంది. బాగా నవ్వుకున్నాము. మీరు అక్కడ ఏమి తిన్నా, మాకు ఇక్కడ మంచి విందు భోజనం పెట్టినందుకు ధన్యవాదాలు.

   
 16. శ్రీనివాస్ పప్పు

  డిసెంబర్ 12, 2011 at 5:29 ఉద.

  కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అద్దరగొట్టేహారంతే

   
 17. shravan

  డిసెంబర్ 12, 2011 at 7:21 ఉద.

  rey moorthi… super ga rasava ga.. nee akali rajyam story ..

   
 18. Sowmya

  డిసెంబర్ 12, 2011 at 8:19 ఉద.

  హాహాహా…. బాగున్నాయి మీ అనుభవాలు… అంటే మీకు నవ్వు రాదనుకోండి, నేను అనుభవించలేదు కనుక నాకొస్తోంది 🙂
  నాకున్న బద్దకానికి, నా చేత ఒక పోస్టు మొత్తం చదివించిన ఘనత మీదే ఈ మధ్య కాలంలో! 🙂

   
 19. మనసు పలికే

  డిసెంబర్ 12, 2011 at 10:12 ఉద.

  హహ్హహ్హా..
  మూర్తి గారూ.. సూపరంటే సూపరు టపా. నవ్వీ నవ్వీ కడుపు నొప్పొచ్చేసింది. పాపం, ఇజ్రాయెల్ ఆన్‌సైట్ కూడా వెళ్తారని నాకు ఇప్పుడే తెలిసింది 😉
  టపా మాత్రం అద్భుతం అంతే. పంచులు చమక్కులు కడుపుబ్బ నవ్వించేశాయి.

   
 20. Rajesh

  డిసెంబర్ 12, 2011 at 10:37 ఉద.

  :)) Super. .

   
 21. Praveen Sarma

  డిసెంబర్ 12, 2011 at 11:46 ఉద.

  మనసు పలికే, భారత దేశంలో అసలు సాఫ్టువేరీ ఉంటుందా అని ఇజ్రాయెల్ వాడనుకుంటాడు. ఎందుకంటే ప్రపంచంలో ఏ సాఫ్ట్వేరీ తయారయినా హీబ్రూలో ఉంటాది, కానీ హిందీలోనో, తెలుగులోనో ఉండదు. నాకు మాత్రం నవ్వు రాలేదు.

   
 22. కొత్తపాళీ

  డిసెంబర్ 12, 2011 at 2:29 సా.

  good one.

   
 23. Nagarjuna

  డిసెంబర్ 12, 2011 at 2:43 సా.

  became fan of murthy

   
 24. Kranthi

  డిసెంబర్ 12, 2011 at 2:52 సా.

  Havva…… inthaa navvva…!!!

   
 25. రహ్మానుద్దీన్ షేక్

  డిసెంబర్ 12, 2011 at 4:19 సా.

  తదుపరి పోస్ట్ ఎప్పుడండీ?

   
 26. నచకి (NaChaKi)

  డిసెంబర్ 13, 2011 at 12:27 సా.

  పంక్తికో పంచ్‌తో పద్ధతిగా పరవశింపజేసావ్! నిజంగా… అప్పుడెప్పుడో చెబితే యిన్నాళ్ళకయినా వచ్చావ్ బ్లాగ్లోకంలోకి… “మా యునికి పావనమై చెలువొందెన్”! (లవకుశ, 1963, వెంపటి సదాశివబ్రహ్మం: “ఇదె మన యాశ్రమంబు…” పద్యం)

   
 27. Naga Muralidhar Namala

  డిసెంబర్ 13, 2011 at 2:47 సా.

  చిన్న చిన్న పేరాలుగా రాస్తే చదవటానికి సులువుగా ఉంటుంది మూర్తి. పంచ్‌లు బాగున్నాయి. ఇంకాస్త నాటకీయత జోడించి ఉంటే టపా మూడ్‌కి బాగా సెట్టయ్యేది. చివరిలో పంచ్ ముందే తెలిసిపోయింది. కాబట్టి నవ్వుకునే అవకాశం మిస్సయ్యింది. కానీ ఇదే నీ మొదటి టపా అనే విషయం దృష్టిలో ఉంచుకుంటే చాలా బాగా రాసావు. ముందు ముందు ఇంకా మంచి పోస్టులు రాయలని కోరుకుంటున్నా.

   
 28. సిరిసిరిమువ్వ

  డిసెంబర్ 13, 2011 at 4:24 సా.

  బాగుంది. ఏదైనా దొరకనప్పుడే దాని విలువ తెలుస్తుంది..మీ కడుపు మంట మాకు నవ్వులు పంచిందన్నమాట!

   
 29. Murthy Ravi

  డిసెంబర్ 13, 2011 at 4:32 సా.

  అందరికీ థాంక్సో థాంక్స్. వీరతాళ్ళు మొయ్యలేక, గులాబ్ జామ్‌లు మెయ్యలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా!! క్లౌడ్ 9 నుంచి ఫ్రీ ఫాలింగ్ లో ఉన్నా. పారాచూట్ ఓపెన్ అయితే మిమ్మల్నందర్నీ మళ్ళీ కలుసుకుంటా.

   
 30. Sreeram

  డిసెంబర్ 14, 2011 at 10:01 ఉద.

  Just superb 🙂

   
 31. bhanu

  డిసెంబర్ 14, 2011 at 3:33 సా.

  enjoyed alot

   
 32. Raju

  డిసెంబర్ 22, 2011 at 12:13 సా.

  kya bath hie, excellent.

   
 33. Raju

  డిసెంబర్ 22, 2011 at 12:14 సా.

  chaaaaaaaaaaaaaaaaaaaalaaaaaaaaaaaaaaaaaaaaaaaa baaaaaaaaaaaaaaaagundi

   
 34. Raju

  డిసెంబర్ 22, 2011 at 12:18 సా.

  after b.tech malli e roje entha laaga navvadam. e software field ki vachaka navvu anedi poyindi, e roju work pakkana petti mari chavinanduku happy ga undi, waiting for the next one.

   
 35. srinivasulu kalluri

  డిసెంబర్ 26, 2011 at 9:20 ఉద.

  i liked it very much….nice narration Moorthi.

   
 36. Gurucharan

  ఫిబ్రవరి 14, 2012 at 5:44 ఉద.

  Hello Murthy .. anubhavam baa raasaru. Inka better ga raayalani korukuntunnaa..

   
 37. Shashikiran

  మే 15, 2012 at 10:06 ఉద.

  నీ పారాచూట్ తెరుచుకుని సురక్షితం గా త్వరలోనే ఎగసి పడే కెరటమై మా తీరానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తు నీ..

   
 38. Naga Venkata Prasad ( Bobby)

  మే 18, 2012 at 8:34 ఉద.

  Nice one Murthy…మనసు నవ్వమంటే శరీరం సహకరించని క్షణాలు…ఈ లైన్ చాల బాగుంది.
  నరసాపురం కృష్ణ స్వీట్స్ ని కూడ టచ్ చేసావుగా

   
 39. shiva

  అక్టోబర్ 26, 2012 at 3:01 సా.

  Hello..6vikram.. Superb dialogues..y dnt u try in movies as a dialogue writer..? nyways..ur post is really awesome.. awaiting more posts from u..

   
 40. Naveen

  ఏప్రిల్ 4, 2013 at 2:09 ఉద.

  Super

   
 41. rahimanuddin

  సెప్టెంబర్ 15, 2013 at 4:46 ఉద.

  అయ్యా, ఇంకా నీ పేరాచ్యూట్ ఓపెన్ అవ్వలేదా?

   

జవాబు

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

 
%d bloggers like this: